హైదరాబాద్ మహా నగరంలో బతుకు భారంగా మారనుందా అంటే అవుననే చెప్తున్నాయి గణాంకాలు.

హైదరాబాద్ మహా నగరంలో బతుకు భారంగా మారనుందా అంటే అవుననే చెప్తున్నాయి గణాంకాలు. ఇన్ఫోమెన్స్ఆన్లైన్ మీడియా స్టార్టప్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫామ్(Infomens Online Media Startup Information Platform) సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని 10 ప్రధాన నగరాల్లో ఈ సర్వే చేయగా.. లివింగ్ కాస్ట్లో హైదరాబాద్ ఆరో స్థానంలో ఉంది. రూ.35 వేల 887తో ముంబై ఫస్ట్ ప్లేస్ లో ఉండగా.. రూ. 27 వేల 813 తో అతి తక్కువ లివింగ్కాస్ట్ కలిగిన నగరంగా జైపూర్ నిలిచింది.
హైదరాబాద్‌లో లక్షల మంది జీతం రూ.15 వేల కంటే ఎక్కువ లేదు. ఒక కుటుంబ ఖర్చు సగటున రూ. 30 వేల నుంచి రూ.50 వేల వరకు అవుతుంది. ఇందులో ప్రధానంగా ఇంటి అద్దెలు, రవాణా ఖర్చులు, నిత్యావసర ధరలు, అదనపు ఖర్చులు కలిపి 31 వేలకు పైనే అవుతుంది. పిల్లల స్కూల్‌ఫీజులు, వైద్యం ఖర్చులు ఇంకా వీటికి. ఒకరు థియేటర్ కు వెళ్లి సినిమా చూడాలంటే కనీసం ఒక్క టికెట్‌కు రూ.150 పెట్టాల్సి వస్తుంది. నలుగురు వెళ్లాలంటే టికెట్లకే రూ.600 అవుతుంది. ఏ కూల్ డ్రింకో, పాప్‌కార్నో అంటే అది మరింత భారమే.
మన దేశంలో కనీస వేతన చట్టం ప్రకారం నైపుణ్యం లేని కార్మికులకు నెలకు రూ.17,494, నైపుణ్యం ఉన్న కార్మికులకు రూ. 21,215 చెల్లించాలని ఉన్నా అది ఎక్కడా అమలు కావడం లేదు. చట్టం అమలు కాకపోవడంతో ప్రైవేట్‌రంగంలో పని చేస్తున్నవారు చాలీచాలని జీతాలతో అప్పులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నారు. ఖర్చులు పెరిగినట్టుగా ఆదాయం పెరగకపోవడంతో సామాన్యులు తీవ్ర పడుతున్నారు. ప్రైవేట్ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారయ్యింది. ఉద్యోగాల్లో ఇంక్రిమెంట్ల సంగతి దేవుడెరుగు జాబ్ ఎక్కడా పీకేస్తారో అన్న భయంతోనే బతకాల్సి వస్తుంది.
మరోవైపు నగరంలో ఇంటి అద్దెలు భారీగా పెరిగిపోయాయి. నగరంలో సింగిల్ బెడ్రూమ్ కావాలంటే శివారుప్రాంతాల్లో కూడా రూ. 6 వేలకు తక్కువకు దొరకడం లేదు. కొంచెం మంచిగా ఉన్న ప్రాంతం అయితే రూ. 15 వేలు పెట్టాల్సిందే. ఇక డబుల్బెడ్రూం సంగతి అయితే చాలామంది మర్చేపోయారు. దీంతో నలుగురు ఉన్న ఫ్యామిలీ కూడా సింగిల్బెడ్రూం, సింగిల్రూమ్లలోనే సర్దుకుపోతున్నారు.
కరోనా టైమ్‌లో అందరూ నగరం వదిలిపోవడంతో ఇంటి అద్దెలను భారీగా తగ్గించి, టులెట్ బోర్డులు పెట్టిన ఓనర్లు తర్వాత ఏడాదికేడాది అద్దెలను విపరీతంగా పెంచారు. నగరంలో ఐటీ కంపెనీలు, వివిధ రకాల పరిశ్రమలు, గవర్నమెంట్ ఆఫీసులు, హాస్పిటల్స్, ప్రముఖ స్కూళ్లు ఉన్న ప్రాంతాల్లో ఇల్లు అద్దెకు తీసుకోవడం సామాన్యుడికి తలకుమించిన భారం అయిపోయింది. దీంతో చాలామంది స్లమ్స్, మమూలు ప్రాంతాలకు వెళ్లి అక్కడే తక్కువకు అద్దెకు తీసుకుని బతుకులీడుస్తున్నారు.
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఐటీ ఏరియాలైన గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్‌తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రూ.25 వేల నుంచి ఇంటి అద్దెలు ప్రారంభమవుతున్నాయి. ఐటీ ప్రాంతాలైన గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో ఇది విపరీతంగా ఉందని ప్రముఖ స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థ అనరాక్ తన తాజా రిపోర్టులో వెల్లడించింది. గచ్చిబౌలి, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో చూస్తే 2021 నుంచి 2024 మధ్యనే ఇంటి అద్దెలు 54 శాతం నుంచి 62 శాతం వరకు పెరిగాయని తేలింది. ఈ ప్రాంతాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దె కనీసం రూ.25వేలు కాగా గరిష్టంగా రూ.35 వేల వరకు ఉంది.
