టీటీడీ చైర్మన్.. మిమ్మల్ని కోర్టుకీడుస్తా: సుబ్రమణ్యస్వామి
టీటీడీ చైర్మన్.. మిమ్మల్ని కోర్టుకీడుస్తా: సుబ్రమణ్యస్వామి
తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో గోవుల మృతిపై తాను త్వరలోనే కోర్టుకు వెళ్లనున్నట్లు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి ప్రకటించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా మాట్లాడిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా సంస్థతో ఢిల్లీలో సుబ్రమణ్యస్వామి మాట్లాడారు. తిరుమలలో సరైన వైద్యం అందించకుండా గోవులను వదిలేస్తున్నారు. పైగా గోవుల మరణాల విషయంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నిర్లక్ష్యపూరితంగా మాట్లాడారని ఆయన అన్నారు. రాజ్యాంగంలో గోవులకు అత్యున్నత స్థానం కలిపించారు. గోవు అంటే జంతువు మాత్రమే కాదు.. కోట్ల మందికి ఆరాధ్య దైవం కూడా అని ఆయన అన్నారు. అలాంటిది గోవుల ఆలనా పాలనా పట్టించుకోకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్నారు. వయసు మళ్లిన ఆవులు చనిపోయాయయంటున్నారు, రేపు మీకు కూడా వయసు మీద పడితే మీ కుటుంబసభ్యులు పట్టించుకోకుంటే ఇలాగే అంటారా అని టీటీడీ చైర్మన్‌పై సుబ్రమణ్యస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. వందల సంఖ్యలో గోవులు చనిపోవడం వెనుక ఏదో కుట్ర ఉంది. వ్యాపార ధోరణితో టీటీడీ వ్యవహరించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. చనిపోయిన గోవులను రెస్టారెంట్లకు పంపుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. గోవుల మృతిపై దర్యాప్తు జరగాలి. టీటీడీ గోశాలలో గోవుల మృతి పై త్వరలో న్యాయస్థానానికి వెళ్తానన్నారు. ఇప్పుడున్న టీటీడీ బోర్డు పాలన అధ్వాన్నంగా ఉంది. గత టీటీడీ బోర్డు చైర్మన్ అందరికీ అందుబాటులో ఉండేవారు.. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేవారని సుబ్రహ్మణ్యస్వామి గుర్తు చేసుకున్నారు.