Hyderabad : మహిళా సెక్యూరిటీ గార్డును లైంగికంగా వేధించిన ఉబర్ రైడర్

మహిళల భద్రతపై ఆందోళనలు తీవ్ర‌మ‌వుతున్నా లైగింక వేధింపుల ఘ‌ట‌న‌లు మాత్రం త‌గ్గుముఖం ప‌ట్ట‌ట్లేదు.

Update: 2024-08-21 02:10 GMT

మహిళల భద్రతపై ఆందోళనలు తీవ్ర‌మ‌వుతున్నా లైగింక వేధింపుల ఘ‌ట‌న‌లు మాత్రం త‌గ్గుముఖం ప‌ట్ట‌ట్లేదు. బంజారాహిల్స్‌లో 23 ఏళ్ల యువతి తన విధులు ముగించుకుని గమ్యస్థానానికి వెళుతున్న సమయంలో ఉబెర్ రైడర్ లైంగిక వేధింపులకు పాల్ప‌డ్డాడు. బాధితురాలు ఇరుమ్ మంజిల్ లొకేషన్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు పని ముగించుకున్న త‌ర్వాత ఇరుమ్ మంజిల్ నుంచి సనత్‌నగర్‌కు వెళ్లేందుకు రాత్రి 11:35 గంటలకు ఉబర్ బైక్‌ను బుక్ చేసింది. రాకేష్ అనే ఉబర్ బైక్ టాక్సీ రైడర్.. ఆమెను లొకేషన్ నుండి పికప్ చేసుకున్నాడు. ఆ త‌ర్వాత‌ బైక్ రైడ్ సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. బైక్‌పై వెళుతున్న స‌మ‌యంలో రాకేశ్ త‌న‌ను అనుచితంగా తాకాడని.. త‌న‌కు అభ్యంతరకరమైన వీడియోలను చూపించాడని బాధితురాలు ఆరోపించింది.

తన నివాసానికి స‌మీపంగా చేరుకోగానే.. బాధితురాలు సాయం కోసం కేక‌లు వేయ‌డం ప్రారంభించింది. వెంట‌నే ఉబర్‌ రైడర్‌ బైక్‌ను ఆపడంతో బాధితురాలు బైక్‌ దిగిపోయింది. చుట్టుపక్కల వారు అత‌డిని పట్టుకునేలోపే అత‌డు బైక్‌పై పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అనుమానితుడైన ఉబర్ రైడర్ రాకేష్‌ను అదుపులోకి తీసుకునేందుకు గాలిస్తున్నారు.

Tags:    

Similar News