Telangana : ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మ‌హ‌త్య‌.. భార్య‌ను రూ.1,790 అప్పు తీర్చ‌మ‌ని సూసైడ్ నోట్‌

వసీం సూసైడ్ నోట్‌లో తన కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. తన భార్య రజనీకి.. కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టినందుకు వసీం క్షమాపణలు చెప్పాడు.

Update: 2024-08-18 14:10 GMT

మూడు నెలలుగా జీతం రాకపోవడంతో మనస్తాపానికి గురైన సూర్యాపేట జిల్లాలో ఔట్ సోర్సింగ్ కార్మికుడు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు వసీం సూసైడ్ నోట్‌లో తన కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నానని పేర్కొన్నాడు. తన భార్య రజనీకి.. కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెట్టినందుకు వసీం క్షమాపణలు చెప్పాడు. రూ.1,790 అప్పు ఉంద‌ని.. అవి వారికి చెల్లించాలని మృతుడు తన భార్యను కోరాడు. తన స్నేహితులను ఉద్దేశించి ఒక ప్రత్యేక నోట్‌లో.. వసీం గత మూడు నెలలుగా జీతం రాక‌పోవ‌డంతో ఇబ్బంది పడుతున్నానని.. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆకాంక్షించారు.

ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ స్పందిస్తూ.. ప్రతి నెలా ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు ఇస్తున్నామ‌ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తోంది. వసీం ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలను, ఘోర వైఫల్యాన్ని బట్టబయలు చేస్తుందన్నారు. "అతని ప్రాణనష్టానికి బాధ్యులెవరు?" అని అడిగారు. మృతుడు వసీం సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ కార్మికుడు.


కేటీఆర్ పోస్టుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ స్పందించారు. సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగి వసీమ్ తన వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న సంఘటనను రాజకీయాలకు వాడుకోవడం దురదృష్టకరమన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. బకాయిలో ఉన్న ఒక నెల వేతనం చెల్లించడానికి ప్రాసెస్ లో ఉందన్నారు. పూర్తి వివరాలు తెలుసుకొని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తే బాగుంటుందన్నారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్న సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రి ఉద్యోగి వసీమ్ కు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ.

Tags:    

Similar News