Israel : ఇజ్రాయెల్ దాడులతో వణికిపోయిన లెబనాన్.. 490 మంది మృతి

సోమవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులలో 90 మందికి పైగా మహిళలు, పిల్లలతో సహా 490 మందికి పైగా మరణించారు

Update: 2024-09-24 02:10 GMT

సోమవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులలో 90 మందికి పైగా మహిళలు, పిల్లలతో సహా 490 మందికి పైగా మరణించారు. లెబనీస్ అధికారులు ఈ దాడిని 2006 ఇజ్రాయెల్-హిజ్బుల్లా యుద్ధం తర్వాత జరిగిన అత్యంత ఘోరమైన దాడిగా పేర్కొన్నారు. ఇజ్రాయెల్ సైన్యం హిజ్బుల్లాకు వ్యతిరేకంగా భారీ వైమానిక దాడికి ముందు దక్షిణ, తూర్పు లెబనాన్ నివాసితులను ఖాళీ చేయమని హెచ్చరించింది.

బీరుట్‌లోని దక్షిణ శివారు ప్రాంతాల్లో త‌ల‌దాచుకున్న సీనియర్ హిజ్బుల్లా కమాండర్ అలీ కరాకిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసిన‌ట్లు తెలుస్తుంది. హిజ్బుల్లాకు చెందిన 800 కంటే ఎక్కువ ప్ర‌దేశాల‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది.

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేప‌థ్యంలో అమెరికా అదనపు దళాలను, ఆయుధాల నిల్వల‌ను అక్కడికి పంపింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ పశ్చిమాసియాలో దిగజారుతున్న పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య 2006 యుద్ధం తర్వాత ఇరుపక్షాల మధ్య లెబనాన్‌కు సోమ‌వారం అత్యంత రక్తపాతమైన రోజుగా నివేదిక‌లు వెల్ల‌డించాయి. తాజా దాడుల్లో ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు లెబనాన్ మీదుగా తక్కువగా ఎగురుతూ హిజ్బుల్లా స్థానాలను లక్ష్యంగా చేసుకున్నాయి.

Tags:    

Similar News