Chaganti Koteswara Rao : కేబినెట్ ర్యాంకు పదవినే చాగంటి తీసుకుంటారా?
చాగంటి కోటేశ్వరరావు(Chaganti) తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధులు
చాగంటి కోటేశ్వరరావు(Chaganti) తెలుగు రాష్ట్రాలలో సుప్రసిద్ధులు. ఆయన మాట వినందే కొందరికి పొద్దుపొడవదంటే అతిశయోక్తి కాదు. ప్రముఖ ప్రవచనకారులలో చాగంటి కోటేశ్వరరావు కూడా ఒకరు. ఇప్పుడాయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ పదవిని(AP Cabinet Post) కట్టబెట్టింది. ప్రభుత్వానికి నైతిక విలువల సలహాదారుగా ఆయనను నియమించింది. ఇందుకు ఆయన అర్హులే! ఎవరూ కాదనరు. ఇక్కడే ఆయనపై కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ఐహికమైన వాంఛలకు, అహంకారాది అరిషడ్వర్గాలకు అతీతంగా ఉండాలని పదే పదే చెప్పే చాగంటి కోటేశ్వరరావు తాను మాత్రం అరిషడ్వర్గాలను జయించలేకపోతున్నారన్నది కొందరి మాట! అలా ఎందుకంటున్నారంటే కేబినెట్ ర్యాంకు పదవి అయితే తప్ప ఆయన స్వీకరించకపోవడాన్ని గుర్తు చేస్తూ ఆ మాట అంటున్నారు. ఇంతకు మునుపు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan reddy) ప్రభుత్వం కూడా చాగంటి కోటేశ్వరరావుకు మంచి పదవినే అప్పగించింది. తిరుమత తిరుపతి దేవస్థానాల(TTD) వారికి ధర్మ ప్రచార పరిషత్ సలహాదారుగా నియమించింది. ధర్మప్రచార పరిషత్ అనేది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక విభాగం. మంచి పదవే! కాకపోతే ఆ పదవికి కేబినెట్ ర్యాంకు మాత్రం లేదు. కారణమేమిటో తెలియదు కానీ చాగంటి కోటేశ్వరరావు మాత్రం ఆ పదవిని స్వీకరించడానికి నిరాకరించారు. తనకు ఎలాంటి పదవులు అక్కర్లేదని ప్రకటించారు. మరి ఇప్పుడు ఎందుకు పదవిని స్వీకరించినట్టు? అన్నది చాలా మంది సందేహం. తన మీద రాజకీయ ముద్ర పడకూడదన్న ఉద్దేశంతోనే జగన్మోహన్‌రెడ్డి ఆఫర్‌ను చాగంటి కోటేశ్వరరావు తిరస్కరించినట్టు అప్పట్టో చెప్పుకున్నారు. ఆ లెక్కన చంద్రబాబు నాయుడు ఆఫర్‌ను కూడా తిరస్కరించాలి కదా! ఇప్పటి వరకైతే ఆయన అవుననలేదు, కాదనలేదు. ఆయన ఏమంటారో చూడాలి.