Tirumala Laddu Prasadam:తిరుమల లడ్డూ... భక్తులు కోరినన్ని తీసుకోవచ్చు!
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తితో తీసుకుంటారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భక్తితో తీసుకుంటారు. లడ్డూలను తీసుకెళ్లి తమ బంధుమిత్రులకు పంచిపెడతారు. తీసుకునేవారు కూడా మహదానందంగా లడ్డూను స్వీకరిస్తారు. ఆ దేవదేవుడి మహా ప్రసాదంగా భావిస్తారు. అలాంటి లడ్డూ ప్రసాదానికి రేషన్ ఉంది. ఇప్పుడు భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇవ్వడానికి తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు తీసుకుంటున్నది.
కొన్ని నెలల కిందట భక్తులకు లడ్డూలను ఆధార్ ఆధారిత రేషన్ విధానంలా ఇవ్వడానికి టీటీడీ(TTD) చర్యలు తీసుకుంది. ఇప్పుడు తమ ఆలోచన మార్చుకుంది. తిరుమలకు వచ్చే భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇవ్వడానికి సంసిద్ధమవుతోంది. అందుకోసం అదనంగా పోటులో సిబ్బందిని కూడా నియమించుకుంటోంది. తిరుమల శ్రీవారి పోటులో ప్రస్తుతం రోజుకు 3.5 లక్షల చిన్న లడ్డూలు, ఆరువేల పెద్ద లడ్డూలు అంటే కల్యాణం లడ్డూలన్నమాట!, 3500 వడలు తయారుచేస్తున్నారు. తిరుమలతో పాటు హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై, తిరుపతిలోని స్థానిక టీటీడీ ఆలయాల్లో కూడా స్వామివారి ప్రసాదాన్ని అమ్ముతున్నారు. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక చిన్న లడ్డూను ప్రసాదంగా ఇస్తారు. రోజుకు ఇలా 70 వేల లడ్డూల వరకు ఉచితంగానే ఇవ్వాల్సి వస్తుంది.ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అదనంగా తీసుకువెళ్లాలని కోరుకుంటారు కాబట్టి లడ్డూలకు డిమాండ్ అధికంగా ఉంటుంది.ఇంతకు ముందు భక్తులు కోరినన్ని లడ్డూలు ఇచ్చే ఏర్పాటు ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్త ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామల రావు ఒక ఇబ్బందికరమైన ఏర్పాటు చేశారు. భక్తులు అదనపు లడ్డూలు తీసుకోవడానికి ఆధార్ కార్డులను వెంట తెచ్చుకోవాలని, ఆధార్ చూపించిన వారికి మాత్రమే ఇచ్చే ఏర్పాటు చేశారు.ఇప్పుడు పాలకమండలికి కొత్త ఛైర్మన్ వచ్చిన తర్వాత మళ్లీ పాత పద్దతికే మొగ్గు చూపుతున్నారు. భక్తులకు కోరినన్ని లడ్డూలు ఇవ్వడానికి ఏర్పాటు చేస్తున్నారు.ఇది మంచి నిర్ణయమని భక్తులు అంటున్నారు.