TDP MP Byreddy Shabari:పుష్ప 2 సినిమాపై టీడీపీ ఎంపీ సెటైరికల్ ట్వీట్.. తర్వాత ఏమైంది?
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.
అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కొద్ది గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నేషనల్ వైడ్ అందరూ ఆసక్తిగా ఉన్నారు. అయితే సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయడానికి కొందరు రెడీ అయ్యారు. ఒక వర్గం (చెప్పాల్సిన పని లేదు) ఇందుకోసం సర్వ సన్నద్ధమయ్యింది కూడా! ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌పై నంద్యాల టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి(TDP MP Byreddy Shabari) చేసిన సెటైరికల్ ట్వీట్ తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అయితే అల్లు అర్జున్ అభిమానుల నుంచి విమర్శలు రావడం వల్లనో, టీడీపీ అధిష్ఠానం నుంచి ఆదేశాలు రావడం వల్లనో తెలియదు కానీ సైలెంట్‌గా ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. అప్పటికే నెటిజన్లు ఆ ట్వీట్‌ను స్క్రీన్‌షాట్ తీసుకోవడంతో సోషల్‌మీడియాలో అది ఇప్పుడు వైరల్ అవుతున్నది.
'అల్లు అర్జున్ గారూ.. నంద్యాలలో మీరు చేసిన ఎన్నికల ప్రచారాన్ని మా ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేకపోతున్నారు. నంద్యాలలో మీరు ప్రీ ఎలక్షన్ ఈవెంట్ నిర్వహించిన విధంగానే.. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే నిర్వహించాలని ఆశిస్తున్నాం. నంద్యాలో పర్యటించాలన్న మీ సెంటిమెంట్ మాకు బాగా వర్కవుట్ అయ్యింది.. మీ సెంటిమెంటే ఇప్పుడు మా సెంటిమెంట్ అల్లు అర్జున్ గారూ.. మీ పుష్ప 2 చిత్రం పాన్ ఇండియా లెవల్‌లో భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.' అని టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి ఎక్స్ లో రాసుకొచ్చారు. దీనిపై అల్లు అభిమానులు మండి పడ్డారు. దాంతో శబరి తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. అంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన మిత్రుడు, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి కోసం నంద్యాలకు వెళ్లి ప్రచారం చేశారు. మరో వైపు.
జగన్ ను ఓడించడమే లక్ష్యంగా పవన్ కల్యాణ్ జనసేన పార్టీ టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా పోటీ చేసింది. అయినప్పటికీ పవన్ కల్యాణ్‌ను కాదని.. నంద్యాలలో శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేయడం సంచలనం గా మారింది. దీంతో తెలుగుదేశం పార్టీ వాళ్లే కాకుండా మెగా ఫ్యాన్స్ కూడా కొందరు అల్లు అర్జున్‌పై కక్ష కట్టారు. అందుకే బన్నీ సినిమాపై దుష్ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు.