తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్పరిరక్షణ సమితి నేతగా పనిచేశారు. అమరావతి ఉద్యమానికి ఊపు తీసుకొచ్చిన నేతగా గుర్తించబడ్డారు. ఆంధ్ర యూనివర్సిటీలో సాధారణ లెక్చరర్ కెరీర్ ప్రారంభించిన కొలికపూడి ఎమ్మెల్యే వరకు ఎదిగారు. గత ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలో చేరి తిరువూరు టీడీపీ టికెట్‌తో గెలిచారు. ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కొలికపూడి వ్వవహారం కొంత వివాదాస్పదంగానే ఉంటోంది. తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఎ. కొండూరు మండలం గోపాలపురం గ్రామంలోని ఓ రహదారికి సంబంధించిన వివాదాన్ని పరిష్కరించేందుకు శనివారం సాయంత్రం ఎమ్మెల్యే వెళ్లిన సందర్భంగా గొడవ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తమ ఇంట్లోకి వచ్చి తమపై దాడి చేసి అవమానకరంగా తిట్టారని ఆరోపిస్తూ గ్రామానికి చెందిన వైసీపీ వార్డు సభ్యురాలు భూక్యా చంటి పురుగుమందు తాగి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమెను తొలుత తిరువూరు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని హెల్ప్ అసుపత్రికి తరలించారు. దీనిపై టీడీపీ అధిష్టానం స్పందించింది. కొలికపూడి శ్రీనివాసరావుకు నోటీసులు ఇచ్చింది. ఎస్టీ మహిళపై దాడి విషయంలో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. గతంలో కూడా ఆయన చౌదరీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వారు ఆగ్రహంగా ఉన్నారు. ఈయన వ్యవహారశైలి నచ్చక పార్టీలో ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే గిరిజన మహిళపై అంశం తెరపైకి రావడంతో ఆయనను మందలించి వదిలిపెడతారా.. లేదా పార్టీ నుంచి బయటకు పంపిస్తారా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది.