రాయలసీమలో కర్నాటక డీజిల్ మాఫియా..!

కర్నాటకలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్‌ కంటే 7 నుంచి 9 వరకు తక్కువగా ఉండడంతో డీజిల్‌ మాఫియా రెచ్చిపోతోంది. కర్నాటక సరిహద్దు జిల్లాలైన అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు అక్కడి నుంచి అక్రమంగా డీజిల్ తరలించి సొమ్ముచేసుకుంటోంది మాఫియా. ట్యాంకర్లు, ట్యాంకర్ల డీజిల్ సీమలో ఉన్న కంపెనీలకు, ఫ్యాక్టరీలకు తరలిస్తున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి కూడా గండి పడుతోంది. అధికారులు కూడా చూసిచూడనట్లు వ్యవహరించడం, వారు కూడా చేతివాటం ప్రదర్శించడంతో అంటే నెలనెలకు మామూళ్లు అందడంతో డీజిల్‌ మాఫియా ఇంకా పేట్రేగిపోతోంది.రాయలసీమలో నిర్మాణంలో ఉన్న అదానీ హూడ్రో పవర్‌ ప్రాజెక్టుకు కూడా కర్నాటక నుంచే డీజిల్ సరఫరా అవుతోంది. ఈ ప్రాజెక్టు కోసం పనిచేస్తున్న వాహనాలు, యంత్రాలకు ఈ డీజిల్‌నే వాడుతున్నారు. గతంలో కూడా ఓ హిందూపూర్ నాయకురాలు కర్నాటక సరిహద్దులో ఉన్న పెట్రోల్‌ పంప్ నుంచి కియా ఫ్యాక్టరీకి డీజిల్‌ను సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. రాయలసీమలో ఉన్న ఫ్యాక్టరీలకే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉండే ట్రాక్టర్లకు, వాహనాలకు కూడా ఈ డీజిలే సరఫరా అవుతున్నట్లు తెలుస్తోంది. రోజుకు 50 వేల నుంచి లక్ష లీటర్ల వరకు డీజిల్ సరఫరా అవుతున్నట్లు సమాచారం. కర్నాటకలో లీటర్ డీజిల్ 89.58 ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో లీటర్ 97.38 రూపాయలుగా ఉంది. రోజుకు లక్ష లీటర్లు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడినట్లే. ఇప్పటికైనా అధికారులు మేల్కోని ఈ డీజిల్ మాఫియాను అరికట్టకపోతే ఇది మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉంది.



Updated On 26 Feb 2025 8:56 AM GMT
ehatv

ehatv

Next Story