Pawan Kalyan: అందుకే పర్యటించలేదు: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో
By : Sreedhar Rao
Update: 2024-09-04 05:24 GMT
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు బాధితుల వద్దకు వెళ్లి పరామర్శించాలని ఉందనీ, అయితే, తాను వెళ్లిన చోట అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని, దాంతో బాధితులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. తన పర్యటన బాధితులకు సహాయపడేలా ఉండాలే తప్పితే, ఆటంకంగా పరిణమించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇక కొందరు కావాలని విమర్శించడం తప్పితే, చేసేదేమీ ఉండదని అన్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలకు వరద బాధితులకు జనసేనాని రూ. 50లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి ఏపీ, తెలంగాణకు చెరో రూ. 50లక్షల చొప్పున ఇస్తున్నానని తెలిపారు. "తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను" అని చిరంజీవి ట్వీట్ చేశారు.