దుమారం రేపుతున్న వైసీపీ కార్యకర్త హత్య

పరిటాల రవి హత్యకేసులో జగన్ పాత్ర ఉందన్న సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు ఒకప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. కాలక్రమేణా అక్కడ పరిస్థితులు చక్కబడినట్లు కనిపించినప్పటికీ.. ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతుండటం స్థానికుల్లో గుబులు రేపుతోందంట. ప్రత్యర్థి నేతలు గతాన్ని తవ్వి పరస్పర ఆరోపణలకు దిగుతుండటం అగ్నికి ఆజ్యం పోస్తోందంట.. దాంతో ఈ రచ్చ ఇక్కడితో ఆగుతుందా? లేక మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారుతుందేమోనని సామాన్యులు బెంబేలెత్తుతున్నారట. అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది?
ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సొంత మండలం పాపిరెడ్డిపల్లిలో వైసీపీ కార్యకర్త హత్యకు గురికావడం పెద్ద దుమారం రేపింది. ఆ హత్య పరిటాల సునీత సొంత బంధువులే చేశారని రాప్తాడు వైసీపీ ఇన్చార్జ్ ప్రకాశ్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన ఆ హత్యను రాజకీయం చేయడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని.. అనవసర రాద్దాంతం చేస్తే చూస్తూ ఊరుకోబోమని పరిటాల సునీత వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు
ఎంపీపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ హత్య జరిగిందని వైసీపీ ఆరోపిస్తుండగా.. ఇది కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవలు అని సునీత వ్యాఖ్యానించారు. ఇంకా ఈ గొడవ జరుగుతుండగానే మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి టీవీ బాంబు గురించి వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఆనాటి రక్త చరిత్ర తెరపైకి వచ్చింది. దీనికి కౌంటర్‌గా పరిటాల సునీత కూడా కారు బాంబు కేసు బయటికి తీయడంతో ఇప్పుడు ఆ వాగ్యుద్ధం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దీనికి తోడు ఈ నెల 8న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటనకు వస్తుండడంతో జగన్‌పై పరిటాల సునీత మండిపడ్డారు. పరిటాల రవి హత్యకేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు.
జగన్ పర్యటనకు ముందే రాజకీయం ఈ స్థాయిలో ఉందంటే.. జగన్ వచ్చిపోతే ఈ ఆరోపణల స్థాయి ఎక్కడికి వెళుతుందోనని రాప్తాడు ప్రజానీకం చర్చించుకుంటూ.. బిక్కుబిక్కుమంటున్నారంట.
