Vizag Airport: విశాఖపట్నం విమానాశ్రయంలో అర్ధరాత్రి హై టెన్షన్
విశాఖపట్నం విమానాశ్రయంలో
By : Sreedhar Rao
Update: 2024-09-04 04:30 GMT
న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం వస్తున్న ఎయిర్ ఇండియా విమానానికి మంగళవారం అర్థరాత్రి బాంబు బెదిరింపు వచ్చిందని, అయితే అది బూటకమని తేలిందని ఓ అధికారి తెలిపారు. ఢిల్లీ పోలీసులకు బాంబు బెదిరింపు కాల్ వచ్చిందని, ఎయిర్‌లైన్స్, విశాఖపట్నం విమానాశ్రయాన్ని అప్రమత్తం చేశామని విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ ఎస్ రాజా రెడ్డి తెలిపారు. "విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఫ్లైట్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేసాం అది తప్పుడు కాల్ అని తేలింది" అని రాజా రెడ్డి PTI కి చెప్పారు. ఢిల్లీ నుండి వైజాగ్ వెళ్లే విమానంలో 107 మంది ప్రయాణికులు ఉన్నారని తెలిపారు.
మంగళవారం సాయంత్రం 5.40 గంటలకు ఏఐ 471 విమానం ఢిల్లీ విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరింది. విమానం బయలుదేరిన కొద్దిసేపటికే ఫోన్ చేసి విమానంలో బాంబు ఉన్నట్టు ఓ వ్యక్తి చెప్పాడు. అప్రమత్తమైన ఢిల్లీ విమానాశ్రయం అధికారులు విశాఖపట్నం విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. ఈ విమానం రాత్రి 8.05 గంటలకు విశాఖపట్నం చేరుకోగా 8.19 గంటలకు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రయాణికులను, లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం బయటకు పంపారు. రాత్రి 8.55 గంటలకు విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరాల్సిన విమానం తనిఖీల కారణంగా కొన్ని గంటలు విమానంలో ఆగిపోవాల్సి వచ్చింది.